గర్భసంచి లేదా గర్భాశయం తొలగించారని చెప్పుకోవటం ఈ మధ్య తరచుగా వింటున్నాం. గర్భధారణలో ముఖ్య పాత్ర పోషించే గర్భసంచి ఆరోగ్యం వయసు పెరిగే కొద్దీ, స్త్రీల శరీరాల్లో వచ్చే మార్పుల కారణంగా కుంటు పడుతుంది. దీని కారణంగా గర్భసంచి తొలగించాల్సి రావచ్చు. కానీ ఈ మధ్య అనవసరమైన సందర్భాలలో కూడా గర్భాశయం తొలగించటం ఎక్కువైంది. సిజేరియన్ సర్జరీ తరువాత అతి ఎక్కువగా జరుగుతున్న ఆపరేషన్లలో ఒకటి.
సృష్టికి ప్రతి స్పష్టి చేయడానికి ప్రకృతికీ కొన్ని పనిముట్లు కావాలి. అందులో ముఖ్యమైనది గర్భసంచి. పుట్టబోయే బిడ్డను కాబోయే అమ్మ కాపాడుకునే సంచి పేరే గర్భసంచి. చాలా మంది మహిళలు చివరి కాన్పు తర్వాత గర్భసంచినిఒక పనికిరాని అవయవంగా పరిగణిస్తారు. తమంతట తామే తొలగించమని కోరేవారూ ఉంటారు. కానీ… బిడ్డలు పుట్టే అవసరం తీరిపోయాక కూడా ‘గర్భసంచి అవసరమే’.
గర్భసంచి తొలగించాల్సిన అవసరం ఎప్పుడొస్తుంది? దీన్ని నివారించే అవకాశం ఎప్పుడుంది?
ఆపరేషన్ ద్వారా గర్భసంచిని తొలగించే ప్రక్రియనే వైద్యపరిభాషలో హిస్టరెక్టమీ అంటారు. వైద్యపరంగా మహిళ ప్రాణాలు కాపాడతానికి తప్పనిసరి అయినప్పుడు ఈ ఆపరేషన్ చేయటం ఒక రకమైతే రోగి తన విచక్షణతో గర్భసంచి తొలగించాల్సిందిగా కోరటం ఇంకోరకం. గర్భసంచి, ఫెలోపియన్ ట్యూబ్స్, ఓవరీస్‌లో క్యాన్సర్లు వచ్చినప్పుడు ఆ గడ్డను తొలగించడానికి గర్భసంచిని తొలగించడం తప్ప మరో మార్గం ఉండదు.
అలాగే కాన్పు సమయంలో గర్భసంచి పగిలిపోయినప్పుడు, గర్భసంచికి తీవ్రమైన ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, నియంత్రణకు ఏమాత్రం వీలుకానంతగా రక్తస్రావం జరుగుతున్నప్పుడు గర్భసంచిని తొలగిస్తారు. అలా కాకుండా, జీవననాణ్యతనుమెరుగుపరచేందుకురోగితనవిచక్షణతోతొలగించు కోవాలని కోరవచ్చు.
తీవ్రమైనరక్తస్రావం, ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియాసిస్, దీర్ఘకాలికంగా పొత్తికడుపు నొప్పి, డిస్‌ఫంక్షనల్ యుటిరైన్ బ్లీడింగ్ వంటి సమస్యలకు గర్భసంచి తీసేయడం ఒక పరిష్కారంగా గర్భసంచి తొలగింపుకు మొగ్గుచూపుతున్నారు. అయితే ఈ సమస్యలకు ఇతర పరిష్కారమార్గాలు కూడా ఉన్నప్పటికీ, గర్భసంచి తొలగింపు కోరటం మీద వైద్య నిపుణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
గర్భసంచి తొలగింపు సర్జరీ ఎన్ని రకాలు? ఏది మెరుగైనది?
గర్భసంచి తొలగింపు రెండు విధాలుగా చేస్తారు. పొట్టమీద చిన్న కోతల ద్వారా వీడియో లాపరోస్కోప్‌ని లోపల ప్రవేశపెట్టి స్క్రీన్ మీద చూస్తూ సర్జరీ చేయవచ్చు. అత్యాధునిక రోబోటిక్ ఆపరేషన్ పరికరాల సహాయంతో బయటి నుండి మణికట్టు కదలికల ద్వారా సర్జన్ త్రీడైమన్షన్ స్క్రీన్ మీద చూస్తూ ఈ తరహా సర్జరీ చేస్తారు. మరోపద్ధతిలో యోనిలో కోత ద్వారా గర్భాశయాన్ని తొలగిస్తారు. ఈ ఆపరేషన్‌లో గాయపు మచ్చకనపడదు.పొట్టకోసి ఓపెన్ సర్జరీ చేసే కంటే వెజైనల్ లేక లాపరోస్కోపిక్ హిస్టరెక్టమీ చేస్తే త్వరగా కోలుకుంటారు, హాస్పటల్ నుంచి త్వరగా వెళ్ళిపోవచ్చు. తక్కువ నొప్పి ఉంటుంది, ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది.
ఓపెన్ హిస్టరెక్టమీ చేస్తే 6వారాలు విశ్రాంతి అవసరం. అదే లాపరోస్కొపీ సర్జరీ లేక వెజైనల్ సర్జరీ అయితే, 2 వారాల విశ్రాంతి చాలు. 3-4 వారాల్లో బయటకు వెళ్ళి తమ ఉద్యోగాలుచేసుకోవచ్చు. ఓపెన్ సర్జరీతో అరుదుగా పొట్ట కోసిన దగ్గర వచ్చే హెర్నియా లేక గిలక వచ్చే ప్రమాదం ఉండదు.
ఐతే లాపరోస్కోపిక్ హిస్టరెక్టమీ ప్రతి ఒక్కరికీ అనువైనది కాదు. గర్భాశయం సైజు మరీపెద్దగా ఉన్నప్పుడు, ఇంతకు ముందు సర్జరీలు అయి లోపలి అవయవాలు అంటుకుపోయి ఉన్నప్పుడు, ఊబకాయం ఉన్నప్పుడు లాపరోస్కోపిక్ సర్జరీ కంటే పొత్తికడుపును కోసి చెయ్యడమే రోగికి సురక్షితం.
హిస్టరెక్టమీలో గర్భాశయాన్ని మాత్రమే తీస్తారు. శరీరంలోని మిగతా అవయవాలన్నీ మామూలుగానే వుంటాయి. బహిష్టులు రావు, గర్భం రాదు. సర్జరీ చేయించుకోవటానికి కారణమైననొప్పి, అధిక రుతుస్రావం లాంటి బాధలు తగ్గిపోవడం వలన అధిక శాతం స్త్రీలకు జీవన నాణ్యత మెరుగుపడుతుంది.కొంతమందికి మాత్రం గర్భాశయం లేకపోవడం, ఇక పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడం దిగులు కలిగించవచ్చు. ఇంకొంతమంది తాము స్త్రీత్వాన్ని కోల్పోయామని కలవరపడతారు.
హిస్టరెక్టమీ జరిగిన తరువాత ఎన్నాళ్లకు కోలుకుంటారు? లైంగిక జీవితం గడపవచ్చా?
మానసికంగా తీవ్రమైన కుంగుబాటు, ఆందోళన, లైంగిక ఆసక్తి తగ్గిపోవడం మొదలైన సమస్యలు రావొచ్చు. అదే విధంగా చాలా మందికి హిస్టరెక్టమీ తరువాత బాగా లావయిపోతామనే అపోహ ఉంటుంది. అవసరాన్ని మించి తినడం, ఏం బాధలొస్తాయోననే భయంతో కదలకుండా కూర్చుని వుండడం వలన బరువు పెరుగుతారు తప్ప సర్జరీ వలన బరువు పెరగరు.
రెండు అండాశయాల్ని తొలగిస్తే హార్మోన్ల ఉత్పత్తి నిలిచిపోయి బహిష్టులు ఆగిపోయాక వచ్చే కొన్ని సమస్యలు రావొచ్చు. జీవనశైలికి సంబంధించిన జాగ్రత్తల్ని పాటిస్తూ డాక్టర్ని సంప్రదించి సమస్యలకు తగిన చికిత్స చేయించుకుంటే జీవన నాణ్యత మెరుగ్గా ఉంటుంది.
సిజేరియన్ తరువాత అతి ఎక్కువగా జరుగుతున్న ఆపరేషన్లలో ఒకటి గర్భసంచి తొలగింపు. ఎక్కువ మంది మహిళల్లో తప్పని సరిగా మారుతోంది. మరికొంతమంది చిన్న చిన్న సమస్యలకు కూడా గర్భసంచి తొలగింపుకే మొగ్గు చూపుతున్నారు. స్త్రీలలో పునరుత్పత్తిలో అత్యంత కీలకమైన గర్భసంచిని తొలగిస్తే నెలసరి ఆగిపోతుంది. పిల్లలు పుట్టే వయసులో ఉన్నవారు గర్భసంచి తొలగింపుకు మొగ్గు చూపకపోవటమే మేలు.
తప్పనిసరి అయినప్పుడు మాత్రం అనేక సమస్యలకు ఇదే పరిష్కారం కావచ్చు. లేపరోస్కోపిక్ విధానం అందుబాటులోకి వచ్చాక హిస్టరెక్టమీ చాలా సులువుగా మారింది.