జీవితంలో ఇతరులకంటే ముందున్నవారిలో తప్పకుండా ఒక మంచి లక్షణం ఉంటుంది. అది… ఎప్పటిపనిని అప్పుడు చేయటం. చేయాల్సిన పనిని మనం వాయిదా వేసినా…కాలం మాత్రం రాకుండా ఆగదు…అది టైంకే వచ్చేస్తుంది. అందుకే మనం పనులను వాయిదా వేస్తున్నామంటే….జీవితంలో కొన్ని అడుగులు వెనక్కు వేస్తున్నామనే. సమయానికి పనులు చేసేవారు అప్పుడు మనకంటే ముందుంటారు. పనులను వాయిదా వేయటం అనేది ఎంత చెడ్డ గుణమో… వాయిదా మనస్తత్వం ఉన్నవారికి కూడా తెలుసు…అయినా అందులోంచి బయటకు రాలేరు…కానీ గట్టిగా తలచుకుంటే వాయిదావేసే గుణాన్ని వదిలించుకోవచ్చు.
కాలాన్ని దొంగిలించే దొంగ
కాలం అనేది ఎంత గొప్పదో మనందరికీ తెలుసు. ఎంత విలువైన వస్తువునైనా పోతే తిరిగి సంపాదించుకోగలం…కానీ పోయిన కాలాన్ని మాత్రం తిరిగి తెచ్చుకోలేము. అందుకే వాయిదా వేసే గుణాన్ని…మన కాలాన్ని దొంగిలించే దొంగగా చెబుతారు పెద్దలు. వాయిదా వేసిన పనులు ఒక్కోసారి మనం జీవితంలో ముందుకు వెళ్లకుండా ఆపేస్తాయి. కొన్ని పనులు ఎప్పటికీ పూర్తికాకపోవచ్చు కూడా. అలాంటివి జీవితంలో తీరని అసంతృప్తులుగా మిగిలిపోయే అవకాశం కూడా ఉంది.. అందుకే వాయిదాని వాయిదా వేసే పద్ధతులేంటో తెలుసుకుందాం.
మనం రోజులో ఎన్నో పనులు చేస్తుంటాం…అయితే అందులో అవసరమైన వాటితో పాటు కొన్ని అనవసరమైనవి కూడా ఉంటాయి. అంటే చేయనక్కర్లేని, చేయాల్సిన అవసరమే లేని పనులను కూడా మనం చాలా చేస్తుంటాం. అలాగే చేయాల్సిన పనుల్లో కొన్నింటిని వాయిదా వేస్తుంటాం. ఉదయం మెలకువ రాగానే మంచం మీద నుండి దిగకుండా…ఇంకాసేపు పడుకుందాంలే….అని బద్దకిస్తూ… రోజుని మొదలుపెట్టటమే వాయిదాతో మొదలుపెడతారు కొందరు. అలాగే రాత్రి పన్నెండు అవుతున్నా…నిద్రపోకుండా… ఫోన్‌తోనే టివితోనో నిద్రని వాయిదా వేయటంతో రోజుకి ముగిస్తుంటారు.
ఈ గుణం అన్ని వయసుల వారిలో సాధారణమే
వాయిదా వేసే గుణంలో అందరిలో అన్ని వయసుల వారిలో ఉంటుంది. పదేళ్ల కుర్రాడు హోంవర్కు చేయటం వాయిదా వేస్తే ఇరవై ఏళ్ల కుర్రాడు…పరీక్షలు వచ్చేవరకు చదవకుండా చదువుని వాయిదా వేస్తుండవచ్చు. ఒక్కోసారి పనులు ఎక్కువ అయిపోయి…ఏది ముందు చేయాలో అర్థం కాక వాటిని వాయిదా వేస్తుంటారు కొందరు. కొన్ని పనులను సరిగ్గా చేయలేమేమో అనే భయంతో కూడా వాయిదా వేస్తాం. కొన్ని పనులు మొదలుపెట్టాలంటేనే అసౌకర్యంగా ఆందోళనగా అనిపించవచ్చు. అలాంటప్పుడు కూడా చాలామంది ఆ పనులను వాయిదా వేస్తారు. అయితే పనులను వాయిదావేసేవారు అలా ఎందుకు చేస్తున్నాం అని కూడా ఆలోచించరు. అది వారి వ్యక్తిత్వంలో భాగంగా మారిపోతుంది.
చాలా సార్లు మనం మన కళ్లముందు కనబడుతున్న పనులు మాత్రమే అర్జంటు అని భావించి వాటినే చేస్తుంటాం. అలా మనకు కనిపించని పనులు వాయిదా పడిపోతుంటాయి. ఒక తల్లి తన కొడుకు లెక్కలు సరిగ్గా చేయటం లేదని గుర్తించింది…దానిని పరిష్కరించడానికి ట్యూషన్ పెట్టించడమో, లేదా తానే కలగజేసుకుని చెప్పడమో, లేదా స్కూలుకి వెళ్లి టీచరుని అడగడమో ఏదోఒకటి చేయాలి…కానీ దానిని ఆమె వాయిదా వేస్తూ పోయింది. ఎందుకంటే పిల్లవాడికి లెక్కలు రాకపోవటం వలన వచ్చే ఫలితం వెంటనే కనిపించేది కాదు కాబట్టి. కొడుకు పది పరీక్షల్లో ఫెయిల్ అయినప్పుడు తను చేసిన తప్పు ఆమెకు అర్థమైంది.
ఏ విషయాన్నైనా విశాలమైన దృక్పథంతో చూడాలి
అందుకే నిపుణులు ఒక విషయాన్ని విశాలమైన దృక్పథంతో చూడటం వలన మనం వాయిదా వేయకుండా పనులు చేయగలం అంటారు. తన కొడుకు అప్పుడు లెక్కలు చేయకపోవటం వలన భవిష్యత్తులో కలిగే నష్టాన్ని చూడగలిగి ఉంటే ఆమె ఆ సమస్యని వెంటనే సవరించగలిగేది. కొందరయితే పనులను వాయిదా వేయడానికి ఏవో ఒక సాకులు వెతుకుతుంటారు. ఆ పని చాలా కష్టమని, తాము బాగా అలసిపోయి ఉన్నామని…తమ మూడ్ బాగోలేదని ఇలా చెబుతుంటారు. తమకి ఇదొక చెడ్డ అలవాటుగా మారిపోయిందని …నవ్వేవారూ ఉంటారు. అయితే ఏది ఏమైనా పనులను వాయిదావేయటం కరెక్టుకాదని తెలుసు కనుక ఆ లక్షణాన్ని వదిలించుకునే ప్రయత్నం చేయాలి.
మనం ఏదైనా పని చేసినప్పుడు దాని ఫలితం వెంటనే వచ్చేయాలని ఎదురుచూస్తాం. ఫలితం సమయానికి రాకపోతే చాలా నిరాశపడిపోతాం. ఇలాంటివారు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే….పనిని సకాలంలో సరిగ్గా చేస్తే ఫలితం కూడా అలాగే సకాలంలో సరిగ్గా వచ్చేస్తుంది. సకాలంలో పనులు చేయాలంటే ముఖ్యంగా మన మెదడు మనకు సహకరించాలి. కొన్నిసార్లు మనకు అర్జంటుగా చేయాల్సిన పనులు ఏమిటో తెలుసు…కానీ వాటిని చేయటం ఇష్టం ఉండదు. అలాంటప్పుడు మనకు మనం ఇతర పనులతో బిజీగా ఉండే ప్రయత్నం చేస్తామట. పని చేయకుండా ఖాళీగా ఉంటే కలిగే అపరాధభావనని తప్పించుకోవడానికి మన మెదడు ఆడే నాటకం అన్నమాట అది.
మెదడు వాయిదా కోసం ఆడుతున్న నాటకం
ఒక పనిని విజయవంతంగా పూర్తి చేయలేమని అనుకున్నపుడు ఆ పనిని వాయిదా వేయాలని అనుకుంటారు చాలామంది. ఒకపనిని పర్‌ఫెక్ట్ గా చేయాలనే ఆత్రుత ఉన్నవారు కూడా అలా చేయలేమేమో అనే భయంతో పనిని వాయిదా వేస్తుంటారు. అలాగే కొంతమంది ఒక పనిని గడువు తేదీ వరకు వాయిదా వేసి చివరి క్షణాల్లో చేస్తుంటారు. అలా చేస్తే తాము బాగా పనిచేగలమని వారు చెబుతుంటారు. కానీ అవన్నీ తప్పుడు నమ్మకాలని…మన మెదడు వాయిదా కోసం ఆడుతున్న నాటకాలని గుర్తించాలి. అప్పుడే మనం వాయిదా లక్షణాన్ని వదిలించుకోగలం.