బిడ్డ పుట్టగానే తల్లిదండ్రులు చాలా సంతోషపడతారు. గుళ్లూ, గోపురాలకు వెళ్ళి మొక్కులు సమర్పించుకుంటారు. కానీ థైరాయిడ్ గ్రంథి గురించి మాత్రం పెద్దగా పట్టించుకోరు. మనలో చాలా మందికి థైరాయిడ్ గ్రంధి గురించి పెద్దగా తెలియదు. కానీ థైరాయిడ్ గ్రంధి నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్లు చేసే మేలు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా పిల్లలు పుట్టిన తొలినాళ్లలో ఇవి అత్యంత కీలకం అనే చెప్పాలి. కానీ ఈ హార్మోన్లు పుట్టుకతోనే క్షీణిస్తే దాన్నే కంజినైటల్ హైపోథైరాడిజమ్ అంటారు.
పిల్లల్లో పుట్టుకతోనూ రావచ్చు
థైరాయిడ్ లోపం అనగానే అదేదో పెద్ద సమస్య అనుకుంటాం. కానీ ఇది పిల్లల్లో పుట్టుకతోనూ రావచ్చు. వీలైనంత తొందరగా గుర్తిస్తే ఇది చిన్న సమస్యే, సులువుగానే అదుపు చేయవచ్చు. గుర్తించకపోతేనే ఇది పెద్ద సమస్యగా మారుతుంది. పిల్లలు జీవితాంతం దీని పర్యవసనాలను అనుభవించాల్సి ఉంటుంది. అంటే శరీరంలోని అన్ని జీవ క్రియలను ఈ హార్మోన్లు ప్రభావితం చేస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవి శరీరం మొత్తాన్ని హుషారుగా ఉంచుతాయి.
థైరాయిడ్ తో ఇన్ని సమస్యాలా?
మన మెడ ముందు భాగాన శ్వాస నాళానికి అటు ఇటుగా సీతాకొక చిలుక ఆకారంలో ఉండేదే థైరాయిడ్ గ్రంథి. శరీరాన్ని ప్రభావితం చేసే హార్మోన్లు ఈ అవయవం నుంచే ఉత్పత్తి అవుతాయి. దురదృష్టవశాత్తు కొంతమంది పిల్లల్లో పుట్టుకతోనే థైరాయిడ్ గ్రంథిలో లోపం తలెత్తవచ్చు. దీంతో మెదడు సరిగా ఎదగదు, ఇతరత్రా శారీరక ఎదుగుదల సమస్యలూ తలెత్తుతాయి. అందుకే శిశువుల్లో థైరాయిడ్ లోపాన్ని వీలైనంత తొందరగా గుర్తించడం అనేది చాలా ముఖ్యం.
ఎందుకంటే సమస్య ఉన్నా బయటికి ఎటువంటి లక్షణాలు కనిపించవు. లక్షణాలు కనబడే సమయానికి జరగాల్సిన అనర్ధాలు జరిగిపోతాయి. మందులు వాడిన దుష్ప్రభావాలను వెనక్కి మళ్ళించడం సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి తల్లిదండ్రులు పుట్టుకతో వచ్చే థైరాయిడ్ లోపంపై అవగాన కలిగి ఉండటం మంచిది. పుట్టుకతో వచ్చే థైరాయిడ్ సమస్యను ఒక రకంగా అవయవ నిర్మాణ లోపమని చెప్పుకోవచ్చు. దీనికి ప్రధాన కారణం థైరాయిడ్ గ్రంథి అసలే ఏర్పడకపోవడం. కొందరికి గ్రంథి మెడలో వేరేచోట ఉండవచ్చు. కొన్నిసార్లు గ్రంథి ఏర్పడినా సరిగా పనిచేయకపోవచ్చు. ఇవన్నీ సమస్యకు దారితీసేవే.
పిల్లల్లో “హైపోథైరాడిజం” ఎలా గుర్తించడం?
హైపోథైరాడిజమ్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి గ్రంథితో ముడిపడి ఉంటుంది దీన్నే ప్రైమరీ హైపోథైరాడిజమ్ అంటారు. ఇందులో TSH ఎక్కువగా ఉన్నా థైరాయిడ్ హార్మోన్లు తగినంతగా ఉత్పత్తి కావు. ఇక రెండోది ఇతరత్రా కారణాలతో వచ్చేది సెకండరీ హైపోథైరాయిడిజం. మెదడు నుంచి సంకేతాలు అందకపోవడం దీనికి మూలం. వీరిలో TSH ఉత్పత్తి కాదు. శిశువుల్లో వచ్చే హైపోథైరాయిడిజంను చిన్న రక్తపరీక్ష ద్వారా తేలికగానే నిర్ధారించవచ్చు.
మడమ నుంచి చిన్న రక్తపు చుక్కను తీసి, దాన్ని ప్రత్యేక కాగితం మీద అంటించి విశ్లేషిస్తారు. పుట్టిన వెంటిన బొడ్డు తాడు నుంచి తీసిన రక్తం నుంచి కూడా దీన్ని గుర్తించవచ్చు. రక్తంలో థైరాయిడ్ గ్రంధిని ప్రేరేపించే టిఎస్హెచ్ మోతాదులు ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉంటే సమస్య ఉందని అనుమానిస్తారు. కొద్దిరోజుల తర్వాత మళ్ళీ పరీక్షిస్తారు. అప్పుడు కూడా టిఎస్హెచ్ ఎక్కువగా ఉంటే హైపోథైరాయిజంగా నిర్ధారిస్తారు. సాధారణంగా పుట్టిన వెంటనే హార్మోన్ల మోతాదులు పెరుగుతాయి. తరువాత తగ్గుతూ వస్తాయి. అందుకే థైరాయిడ్ పరీక్షలను పుట్టిన రెండు మూడు రోజుల తర్వాతనే చేస్తారు.
చికిత్స ఎలా ఉంటుంది? జీవితాంతం మందులు వాడాలా?
పుట్టిన తొలినాళ్లలలో మెదడులోని నాడీ కణాల మధ్య అనుసంధానాలు విస్తృతంగా పుట్టుకొస్తుంటాయి. థైరాయిడ్ హార్మోన్లు లోపిస్తే ఇవి సరిగా ఏర్పడవు. దీంతో ఎదుగుదల సరిగా ఉండదు. తల నిలపటం, నవ్వటం, బోర్లా పడటం వంటివి మందగిస్తాయి. బొమ్మను వదిలేస్తే ఒక పక్కకు ఒరిగినట్టు పిల్లలు పక్కకు పడిపోతుంటారు. ఇలాంటి లక్షణాలు మూడు నెలలు దాటాకనే బయటపడుతుంటాయి. అప్పటికే జరగాల్సిన నష్టం జరుగుతుంది. ఒకసారి నాడీ కణాల అనుసంధానాలు దెబ్బతింటే తిరిగి మామూలు స్థితికి రావు. అందువల్ల సమస్యను ఎంత త్వరగా గుర్తిస్తే అంతమంచిది.
పుట్టిన వెంటనే ముందస్తు పరీక్షలతో దీన్ని గుర్తించవచ్చు. లేకపోతే దీని అనర్ధాలు జీవితాంతం వెంటాడుతుంటాయి. చికిత్సతో ఇబ్బందులను తగ్గించవచ్చు కానీ సమస్యను పూర్తిగా వెనక్కి మళ్ళించడం సాధ్యం కాదు. ఏదో ఒక లోపం కొనసాగుతూనే వస్తుంది. స్క్రీనింగ్ తో దీన్ని పూర్తిగా నివారించుకోవచ్చని గుర్తించటం ఎంతైనా అవసరం. హైపోథైరాయిడిజంలో ఎదుగుదల దెబ్బతింటుంది కాబట్టి క్రమం తప్పకుండా మందులు వాడటం చాలా ముఖ్యం. గ్రంథి అసలే ఏర్పడకపోయినా, చిన్నగా ఉన్నా, ఉండాల్సిన చోట లేకపోయినా జీవితాంతం మందులు వేసుకోవాల్సి ఉంటుంది.
పిల్లల్లో పుట్టుకతో థైరాయిడ్ లోపించినా పైకి ఎలాంటి లక్షణాలు కనిపించవు. అయితే కొన్ని లక్షణాలను చూస్తే చర్మం పసుపు రంగులోకి మారడం, బలహీనత, ఎక్కువసేపు నిద్రపోవడం, పాలు సరిగా తాగకపోవడం, చర్మం పొడిబారడం వంటివి బహిర్గతమవుతాయి. ఏది ఏమైనా థైరాయిడ్ స్క్రీనింగ్ చేయించడం తప్పనిసరి.