కష్టపడి పనిచేసేవాడు నాయకుడు అయితే బద్దకంగా ఉండేవాడు బానిస అవుతాడు అనేది ఒక కొటేషన్. అవును బద్దకం ఉన్నవారు ఇతరులకు బానిసల్లా జీవించాల్సి వస్తుంది. బద్దకం ఉన్నపుడు జీవితంలో వెనుకబడి పోవడమే కాకుండా తమపని కూడా తాము చేసుకోలేని పరిస్థితుల్లోకి వెళ్లిపోవచ్చు. అలాంటప్పుడు ఇతరులపై ఆధారపడి బతకాల్సి వస్తుంది. జీవితంలో అడుగడుగునా ఆటంకంగా మారే బద్దకం మహమ్మారిని వదిలించుకోవటం చాలా అవసరం.
జీవితం ప్రవాహంలోని తాజా నీరులా ఉండాలి
బద్దకం అనేది అన్ని రకాల భూతాలకు, దయ్యాలకు తల్లి లాంటిది అంటారు. దీనిని బట్టే చెప్పవచ్చు. అది మనకెంత నష్టాన్ని కలగజేస్తుందో. జీవితంలో మనం ఎటువైపు ముందడుగులు వేయాలన్నా పనిచేయాల్సిందే. పనితోనే మనం మన జీవిత శిల్పాన్ని చెక్కుకుంటాం. పనిచేస్తేనే జీవితం ప్రవాహంలోని తాజానీరులా ఉంటుంది. బద్దకంతో కదలకుండా ఉండిపోతే మురికినీటి గుంటలా తయారవుతుంది. బద్దకం ఎంత అసహ్యకరమైనదో తెలుసుకున్నాక దానిని వదిలించుకోకుండా ఎవరైనా ఉండగలరా!
బద్దకాన్ని తల్లిదండ్రుల పెంపకంలో లోపంగా భావించవచ్చా?
చురుగ్గా ఉండటం, ఎప్పటిపని అప్పుడు చేయటం, కష్టపడి పనిచేయటం ఇవన్నీ జీవితాన్ని ముందుకు నడిపించే లక్షణాలయితే…వీటన్నింటికీ వ్యతిరేక పదంగా బద్దకాన్ని చెప్పవచ్చు. బద్దకానికి క్రమశిక్షణ కూడా వ్యతిరేకపదమే. టైం ప్రకారం ఎప్పటిపనులు అప్పుడు చేసేవారి జోలికి బద్దకం రాదు.
ఎవరైతే పనులను వాయిదా వేస్తుంటారో వారిలో బద్దకం స్థిరంగా నివాసం ఏర్పరచుకుంటుంది. ఒక పద్ధతి ప్రణాళిక లేకుండా బతికేసేవారిలో కూడా బద్దకం ఎక్కువగా ఉంటుంది. నిద్రలేవటం నుండి రాత్రి నిద్రపోయేవరకు ఎప్పుడు ఏ పని చేయాలి అనే పట్టింపు వీరికి ఉండదు.
- బద్దకంగా టీవీముందు కూర్చునో
- స్నేహితులతో కబుర్లుచెబుతూనో
- వీడియో గేములు ఆడుతూనో టైం పాస్ చేసేస్తుంటారు.
అంటే బద్దకస్తులు పనికిరాని పనులతో ఎక్కువగా కాలక్షేపం చేస్తారని చెప్పవచ్చు.
అసలు పనే చేయబుద్ది కాకపోవటం ఒకరకం బద్దకం అయితే కొంతమందికి కొన్ని రకాల పనులు చేయాలంటే బద్దకంగా ఉంటుంది. మిగిలిన పనులు చేస్తున్నా…ఆ పనులను మాత్రం వాయిదా వేస్తుంటారు. అలాగే కొన్నిసార్లు వృత్తిపరమైన పనుల్లో బాగా అలసిపోయి ఇంటికి వచ్చాక బూట్లు విప్పటానికి కూడా బద్దకించేవారు ఉంటారు.
కొంతమంది ఏ విషయం గురించైనా త్వరగా నిర్ణయాలు తీసుకోలేరు. తరువాత చూద్దాంలే అని పూటలు రోజులు ఏ పనీ లేకుండా గడిపేస్తుంటారు. సవ్యమైన నిర్ణయాలు తీసుకోలేకపోయినా ఇలా బద్దకం వెంటాడుతుంది. శరీరానికి మెదడుకి చురుకుదనం ఇచ్చే ఆహారాన్ని తీసుకోలేనప్పుడు కూడా పనిచేయాలనిపించక బద్దకం ఆవహించవచ్చు.
బద్దకం అనేది సాధారణంగా ఏ వయసునుండి మొదలవుతుంది?
బద్దకాన్ని పెంచే కారణాల్లో ముఖ్యమైనది…అసలు పనిచేయాలని అనిపించకపోవటం అంటే పనిచేయాలి…అనే స్ఫూర్తి రాకపోవటం. జీవితంలో ఏం చేయాలి అనే విషయంలో స్పష్టత లేకపోయినా, ఎలాంటి లక్ష్యాలు లేకుండా…చిన్నతనం నుండీ సుఖంగా సౌకర్యంగా విలాసంగా బతకటం అలవాటుగా మారినా బద్దకానికి బానిసలుగా మారే ప్రమాదం ఉంది. నిరాశానిస్పృహలు బాధలు ఉన్నవారికి కూడా ఏ పనీ చేయాలని అనిపించక పోవచ్చు.
అలాగే ఇంకా బాగా పనిచేయాలి జీవితంలో ముందుకు వెళ్లాలి అనే కోరిక లేనివారు కూడా బద్దకంగానే కనబడతారు. వారు ప్రతిరోజు చేసే పనులు మాత్రమే చేసేసి మిగిలిన సమయమంతా వినోదాన్ని ఇచ్చే అంశాలతో గడిపేస్తుంటారు.
తమ గురించి తాము తక్కువగా భావించుకునేవారు కూడా బద్దకానికి గురయ్యే ప్రమాదం ఉంది. తాము విలువ కలిగిన మనుషులం అని భావించలేని వారు మంచి ఇంట్లో ఉండాలని, మంచి ఆహారం తీసుకోవాలని, తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఆలోచనలు చేయలేరు.
తమకు ఏదయితే అందుబాటులో ఉందో దాంతోనే సరిపెట్టుకోవాలని అనుకుంటారు. దాంతో వారు పనిచేయటం కంటే ఖాళీగా బద్దకంగా ఉండటానికే ఇష్టపడతారు. బాధ్యతలు పట్టించుకోనివారు కూడా పనిచేయడానికి ఇష్టపడరు. భార్యాపిల్లల బాధ్యతలు పట్టించుకోని భర్తలను మనం సమాజంలో చూస్తుంటాం. బాద్యతలంటే భయం వలన వీరు బద్దకానికి చేరువ అవుతుంటారు.
బద్దకస్తులు పనంటే ఎందుకు భయపడతారు?
బద్దకాన్ని వదిలించుకోవడానికి జపాన్ వారు ఒక సూత్రాన్ని కనిపెట్టారు. దీనిపేరు కైజెన్. కై అంటే మార్పు జెన్ అంటే జ్ఞానం. ఈ సూత్రం ప్రకారం మనకు నచ్చని పనిని, ఆ పని అంటేనే బద్దకం అనిపించే పనిని ప్రతిరోజు ఒక్క నిముషం పాటు చేయాలి. కేవలం ఒక్క నిముషం అంతే.
వ్యాయామం, ఇల్లు సర్దటం, తోటపని లాంటి పనులను ఇలా నిముషం పాటు చేసినప్పుడు ఆ పనులపట్ల మనకున్న నెగెటివ్ ఫీలింగ్ పోతుంది. ఒకే నిముషం కాబట్టి ఆ పని చేయడానికి మన మనసు కూడా సహకరిస్తుంది.
బద్దకాన్ని వదిలించుకునే మార్గాలు
బద్దకం ఉన్నవారు …తమకు తాముగా అందుకు కారణాలు ఏమిటో తెలుసుకోవటం మంచిది. ఎవరి జీవితం గురించి వారికే బాగా తెలుస్తుంది. అందుకే బద్దకంతో రోజులు గడిచిపోతున్నపుడు అలా ఎందుకు జరుగుతుందో ఒకసారి ఆలోచించుకోవాలి.
తలకు మించిన పనుల్లో కూరుకుపోతున్నారా పనిచేయాలంటే శరీరంలో శక్తి ఉండటం లేదా లేదా చేయాలనే ఆసక్తి కలగటం లేదా…లాంటి ప్రశ్నలు వేసుకోవాలి. పనిచేయాలనిపించేలా చుట్టూ పరిస్థితులు లేకపోయినా బద్దకంగానే అనిపిస్తుంది.
బద్దకంగా అనిపిస్తున్నవారు మొదట తమ చుట్టూ ఉన్న పరిస్థితులను బాగు చేసుకోవాలి. పనులు చేయకుండా తమని ఆటంక పరుస్తున్నవి ఏమిటో గ్రహించాలి.
పనులు పెద్దగా, భారంగా కనబడుతున్నపుడు వాటిని చిన్న భాగాలుగా విడగొట్టుకోవాలి. ఉదాహరణకి సింక్ నిండా అంట్లు పేరుకుపోయి భయపెడుతున్నపుడు మొదట ఈ పూటకు అవసరం అయినవి మాత్రమే కడిగేద్దాం అని మొదలుపెట్టాలి. అయితే అలా మొదలుపెట్టగానే బద్దకం పారిపోతుంది పనైపోతుంది.
హోంవర్కులు, ప్రాజెక్టు వర్కులు వాయిదా వేసే పిల్లలకు కూడా ఇది వర్తిస్తుంది. అలాగే మంచి ఆహారం, నిద్ర, వ్యాయామం, విశ్రాంతి ఉండేలా చూసుకుంటే…పనిచేయాలనిపిస్తుంది. పనిచేయటం వలన వచ్చే లాభాలను ఊహించుకోవాలి. నేను నా పని పూర్తి చేయగలను…అని తమకు తాము చెప్పుకోవాలి…ఇలాంటి చర్యలతో బద్దకాన్ని వదిలించుకోవచ్చు.
చివరిగా
ఈ సృష్టిలో బద్దకం అనేది మనుషుల్లోనే ఎక్కువగా కనబడుతుంది. సూర్యుడు చంద్రుడు గ్రహాల నుండి మన శరీరంలోని అవయవాల వరకు అన్నీ తమ పనులు తాము నిరంతరం చేస్తుంటాయి. విశ్వమంటేనే బద్దకం లేనిది అనే అర్థం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సృష్టిలో అన్నీ కదులుతుంటాయి, మారుతుంటాయి.
కదలిక, చురుకుదనం, చలనం మన చుట్టూ ఇదే ఉంది. అందుకే కదలికని ఆపేసే బద్దకంతో జీవితమే స్తంభించిపోతుందని గుర్తుంచుకోవాల్సిందే.