ఈ ప్రపంచంలో కొంతమంది అనుకున్నది సాధించేవరకు చాలా పట్టుదలగా పోరాడుతుంటే కొంతమంది మాత్రం మధ్యలోనే వదిలేస్తుంటారు. కలలు కన్నవారంతా వాటిని సాకారం చేసుకోలేరు అందుకు కారణం…వారిని నడిపించే ఉత్సాహపరచే ప్రేరణ లేకపోవడమే. దానినే మోటివేషన్ అంటారు. మోటివేషన్ లేకుండా మనం ఏ పనీ చేయలేము. అది ఉన్న వారు అపజయాలను అడ్డంకులను లెక్కచేయరు…అదే మోటివేషన్ లేకపోతే మాత్రం…ఏ ఆటంకాలు లేకపోయినా ముందుకు సాగలేరు.
మోటివేషన్ అంటే
అతి చిన్న స్థాయి నుండి కోట్లకు పడగలెత్తినవారు, అంగవైకల్యం ఉన్నా అనుకున్నది సాధించినవారు, అకుంఠిత దీక్షతో కష్టపడి ఒలింపిక్ పతకాలు సాధించిన విజేతలను మనం నిత్య జీవితంలో ఎంతోమందిని చూస్తుంటాం. అబ్బురపరచే విజయాలు అవి. అలాంటి విజయాలు అతి కొద్దిమందికే సాధ్యమవుతుంటాయి.
మిగిలిన వారంతా ఎన్ని కలలు కోరికలు ఉన్నా ఏవీ నెరవేర్చుకోలేక సాధారణ జీవితాన్ని గడుపుతుంటారు. విజయాలు సాధించేందుకు అవవసరమైన ఇంధనం మోటివేషన్ లోపించడమే అందుకు ప్రధాన కారణం.
ఉదయం నిద్రలేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయేవరకు మనం రకరకాల పనులు చేస్తుంటాం. మనం నిత్య జీవితంలో చేసే ప్రతి పని వెనుక ఒక మోటివేషన్ ఉంటుంది. ఉదయాన్నే లేచి పిల్లలకోసం వంటచేసే తల్లి మనసులో తన పిల్లలు కడుపు నిండా తినాలని, వాళ్లు ఆరోగ్యంగా ఉండాలనే ఆరాటం ఉంటుంది. అదే మోటివేషన్ గా పనిచేయటం వలన ఆమెకి తను చేస్తున్న పనిలో శ్రమ అనేది తెలియదు.
చెట్టుకి నీళ్లు పోసి పెంచే వ్యక్తికి దానికి పూచే పూలు కళ్ల ముందు కదలాడుతుంటాయి. ఆ పూలే అతనికి మోటివేషన్ గా పనిచేస్తాయి. ఇలా ఒక పనిని చేయడానికి మనకు ప్రేరణగా నిలిచే అంశాన్నే మోటివేషన్ గా చెబుతాం.
మోటివేషన్ ఎందుకు కావాలి?
చిన్న పని పెద్ద పని అన్నింటికీ మోటివేషన్ అవసరం. అంతేకాదు పనిని మామూలుగా కాకుండా ప్రేమగా ఇష్టంగా శ్రద్ధగా చేయడానికి కూడా మోటివేషన్ కావాలి. అయితే ఇంత అవసరమైన మోటివేషన్ అందరిలో ఒకేలా కనిపించదు. కొంతమందిలో చిన్నతనం నుండే బాగా చదువుకోవాలి గొప్పగా పేరు తెచ్చుకోవాలనే ఆశలు ఉంటాయి. కొందరికి తల్లిదండ్రులు పడే కష్టమే మోటివేషన్ గా పనిచేస్తుంది, కొంతమందికి చిన్నతనంలో పడిన కష్టాలే మోటివేషన్ గా పనిచేసి జీవితంలో పైకి రావాలని శ్రమపడతారు.
అయితే జీవితంలో కష్టాలు పడినవారందరిలోనూ అంతే స్థాయిలో మోటివేషన్ ఉంటుందని చెప్పలేము. జీవితంలో పైకి రావాలనే కోరిక అందరిలో ఉన్నా దాన్ని సాధించడానికి సరిపడా మోటివేషన్ మాత్రం అందరిలో ఉండదు. అందుకే చాలా కొద్దిమంది మాత్రమే జీవితంలో అనుకున్నది సాధిస్తుంటారు.
అందరిలో మోటవేషన్ ఒకేలా ఎందుకు ఉండదు?
చిన్నతనంలో పిల్లలను నువ్వేమవుతావు అనడిగితే…నేను పోలీస్ అవుతాను…నేను డాక్టరు అవుతాను…అంటూ తమకు నచ్చిన వృత్తి పేరు చెబుతుంటారు. సినిమాల్లోనో నిజ జీవితంలోనో ఆ వృత్తుల్లో ఉన్నవారు తమని ఆకర్షించడం వలన వారు అలా మాట్లాడతారు. చిన్నతనంలోనే కాదు…పెద్దయ్యాక కూడా కొంతమంది సినిమా హీరోలను రాజకీయనాయకులను సమాజంలో వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులను చూసి మోటివేట్ అవుతుంటారు. అయితే ఆ ప్రేరణ ఎక్కువ రోజులు నిలవదు. మోటివేషన్ అనేది నిరంతరం నిలవాలంటే మన ప్రయత్నాలు కూడా ఉండాలి.
- కష్ట పడలేకపోవటం
- తమమీద తమకు నమ్మకం లేకపోవటం
- అంతకుముందు ఎదుర్కొన్న అపజయాలు వెక్కిరించడం
- ప్రోత్సహించి అండగా నిలిచేవారు లేకపోవటం
మొదలైన కారణాల వలన చాలామంది ఎలాంటి మోటివేషన్ లేకుండా రొటీన్ గా బతికేస్తుంటారు.
మోటివేషన్ ఉండాలంటే కొన్ని మంచి వ్యక్తిత్వ లక్షణాలు కూడా ఉండాలి. ఉదాహరణకు సహనం చాలా తక్కువగా ఉన్నవారిలో మోటివేషన్ తక్కువగా ఉంటుంది.
మోటివేషన్ ఉన్నవారిలో ఏ లక్షణాలు ఉంటాయి?
మోటివేషన్ నిరంతరం ఉండాలంటే సహనంతో పాటు మాటమీద నిలబడే గుణం, కష్టపడే తత్వం లాంటి మంచి లక్షణాలు ఉండాలి. అలాగే మనం ఒక లక్ష్యం ఎంచుకున్నపుడు దానిని ఎందుకు సాధించాలని అనుకుంటున్నామో స్పష్టంగా తెలియాలి. అప్పుడే మోటివేషన్ కలుగుతుంది. కలెక్టరు జాబ్‌లోని గొప్పతనం…ఆ హోదాలోకి వెళితే తను ఏం చేయగలడో తెలియకపోతే ఒక విద్యార్థి కలెక్టరు కావాలనే ప్రయత్నం చేయడు.
ఇతర లక్షణాలు
ద్రవరూపంలో ఉన్న నీళ్లు రాళ్లను కోసేయగలుగుతాయి. ఎందుకంటే ప్రవాహం ఆగకుండా పరుగులు తీస్తూనే ఉంటుంది కనుక. అలాగే మోటివేషన్ ఉన్నవారు ప్రయత్నాలు ఆపరు. మన మెదడు సాధారణంగా పాజిటివ్ గా కంటే నెగెటివ్ గా ఎక్కువగా ఆలోచిస్తుంది. అందుకే లక్ష్యం దిశగా దీర్ఘకాలం పట్టుదలగా కృషి చేయనివ్వదు. ఒకటి రెండు ప్రయత్నాలు ఫెయిలయితే చాలు…ఇక నమ్మకం కోల్పోయి… ప్రయత్నాన్ని వదిలేయమంటుంది. అయినా పట్టుదలగా మోటివేషన్ ని నిలబెట్టుకోవాలంటే కొన్ని ప్రయత్నాలు చేయాల్సిందే.
మోటివేషన్ ఎలా అలవర్చుకోవాలి?
మోటివేషన్ అనేది సహజంగా మనలో లేకపోయినా కొన్ని ప్రయత్నాల ద్వారా దానిని సాధించవచ్చు. నిరంతరం ప్రతి పనిలోనూ మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ముందుకు సాగవచ్చు. పరీక్షలకు చదువుతున్న విద్యార్థి నాలుగు చాప్టర్లు చదివేశాక ఫ్రెండ్ తో పావుగంట ఫోన్లో మాట్లాడతాను అనుకుని తనకు తానే ఉత్తేజాన్ని ఇచ్చుకుంటే చదివేందుకు ఉత్సాహం వస్తుంది. అప్పడప్పుడు నిరాశ నిస్పృహలు ఆవహిస్తూ ఉండటం ఎవరికైనా సహజమే. ఇలాంటప్పుడు ఉత్సాహం ఉల్లాసం ఉన్నట్టుగా నటిస్తే మన ప్రవర్తన అలాగే మారుతుంది అంటున్నారు నిపుణులు.
స్వీయ మోటివేషన్ ని పెంచే ప్రయత్నాలు
ఈ చిన్న ప్రయత్నంతో మోటివేషన్ ని తిరిగి తెచ్చుకోవచ్చు. అలాగే ఏమీ చేయబుద్ది కావటం లేదు అనిపించినప్పుడు చాలా చిన్నపాటి పనులను పూర్తి చేయాలి. అలా చేయటం వలన లోపల ఉన్న స్థబ్దత తొలగిపోయి అడుగులు ముందుకు పడతాయి. మోటివేషన్ నిలిచి ఉండాలంటే లక్ష్యం ఆకర్షణీయంగా ఉండాలి. గొప్ప లక్ష్యాన్ని నిర్దేశించుకున్నపుడు కూడా పనిచేయాలనే మోటివేషన్ పెరుగుతుంది. ఇలాంటి ప్రయత్నాలతో స్వీయ ప్రేరణని పెంచుకోవచ్చు.
చివరిగా
చిన్నతనంలో మనకు ఏది అలవాటనా అది చిరకాలం మన మనసుల్లో నిలిచి పోతుంది. మోటివేషన్ కూడా చిన్నతనం నుండి అలవాటుగా మారితే ఎల్లకాలం మనతో ఉంటుంది. పిల్లలు ఏదయినా పనిని బాగా చేసినప్పుడు…వారిని పొగడటం వలన మోటివేషన్ రాదంటున్నారు నిపుణులు. వ్యక్తిగతంగా పొగడకుండా…ఆ పని గొప్పతనాన్ని విప్పి చెప్పాలని… దీనివలన పిల్లలకు లక్ష్యాన్ని సాధించడం లో ఉన్న విలువ అర్థమవుతుందని వారు సలహా ఇస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మన మీద మనకే కోపం వస్తే ఏంచేయాలి?
నెగెటివ్ గా ఆలోచించడం కూడా వ్యసనమేనా?
ఎప్పుడూ నవ్వుతూ ఉండటం అన్ని సమస్యలకూ పరిష్కారమా?
[wpdiscuz-feedback id=”fb1nwh7mtq” question=”Please leave a feedback on this” opened=”0″][/wpdiscuz-feedback]