సమస్య:
నేను ఇంతకుముందు నా సమస్యను రాశాను మీ సలహా ప్రకారం ఎటువంటి మందులు వాడకుండా మేము కలిసాము. నేను కన్సీవ్ అయ్యాను, ఇప్పుడు నాకు 3వ నెల. అయితే నాకు గ్యాస్ సమస్య ఉంది. దీనివల్ల నాకు పొత్తికడుపులో నొప్పి వస్తోంది. ఈ నొప్పి తగ్గాలంటే ఏంచేయాలి? ఇంకా ప్రెగ్నెన్సి సమయంలో టమాట, ఆలుగడ్డ, కొబ్బరి తినవచ్చా? ఏం వెజిటేబుల్స్ తీసుకోవాలి? – పుష్ప, ఖమ్మం
సలహా:
స్త్రీ గర్భందాల్చిన తరువాత ఎక్కువసేపు తినకుండా ఉండకూడదు. రాత్రి భోజనం తరువాత నుంచి ఉదయం అల్పాహారం తీసుకునే సమయం వరకు మధ్యలో 12 గంటల గ్యాప్ ఉండే అవకాశం ఉంది. గర్భిణీలు ఇంత సమయం ఏమీ తినకుండా ఉండటం మంచిది కాదు. దీనివల్లే కడుపులో గ్యాస్ సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది.
అందుకని గర్భిణీ రాత్రి 8 గంటలకు భోజనం చేస్తే రాత్రి పడుకోబోయే ముందు అంటే తిన్నాక ఒక రెండు గంటలు ఆగి మళ్ళీ ఒక గ్లాస్ పాలు తీసుకోవాలి. ఆ తరువాత మరో రెండు గంటలు ఆగి ఇంకేదైనా అల్పాహారం అంటే బిస్కెట్స్ వంటివి తీసుకుంటూ కడుపు ఎక్కువసేపు ఖాళీగా ఉండకుండా చూసుకోవచ్చు.
మసాలా కలిగిన ఆహారాలు తగ్గించి పెరుగన్నం వంటివి తీసుకుంటే ప్రెగ్నెన్సీలో అసిడిటి సమస్యను తగ్గించుకోవచ్చు. గర్భంతో ఉన్నపుడు స్త్రీలు ఏ రకమైన కూరగాయలైనా తీసుకోవచ్చు. ఏ ఆహారం అయినా అది బంగాళాదుంప కావచ్చు, టమాటా, కొబ్బరి ఏదైనా సరే వాటికి ఎక్కువ మసాలాలను కలిపి వండకూడదు.
మసాలాలు వీలైనంత తక్కువగా తింటే మీరు తిన్న ఆహారం సులువుగా జీర్ణం అయ్యి గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. గర్భధారణలో హార్మోన్లలో మార్పులు జరిగి కడుపులోని పేగులన్నీ (gastrointestinal tract) ప్రభావితమవుతాయి. అందుకని గర్భిణీలలో మలబద్ధకం, తిన్నది సరిగా జీర్ణం కాకపోవడం, బాగా వాంతులవడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ కారణాల వల్ల కూడా గర్భిణీ పొత్తి కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది.
పొత్తికడుపులో నొప్పి అనేది కేవలం గ్యాస్ వల్లనే వస్తుందనుకోవడం పొరపాటు. స్త్రీ గర్భందాల్చిన తరువాత ప్రతినెలా గర్భసంచి సైజు పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల గర్భసంచి చుట్టూ ఉన్న లిగమెంట్స్ సాగి గర్భిణీలలో పొత్తి కడుపు నొప్పి వస్తుంది. అయితే నొప్పి విపరీతంగా ఉండి కళ్ళు తిరగడం, ఒక్క రక్తపు బొట్టు అయినా బ్లీడింగ్ అవడం వంటివి జరిగితే దాన్ని సీరియస్ గా తీసుకోవాలి. వెంటనే మీ గైనకాలజిస్ట్ సంప్రదించి చికిత్స చేయించుకోవాలి.
క్లుప్తంగా :
గర్భిణీలలో గ్యాస్ సమస్యలు ఎందుకొస్తాయి?
గర్భిణీలు ఎక్కువసేపు కడుపుని ఖాళీగా ఉంచడం వలన గ్యాస్ సమస్య వచ్చే అవకాశం ఉంది. అందుకే ఎక్కువ సమయం తినకుండా ఉండకూడదు. ప్రతి రెండు గంటలకు ఒకసారి కొంచెం కొంచెంగా ఏదో ఒకటి తింటూ ఉండాలి. ఇలా చేస్తే కడుపులో గ్యాస్ పెరగకుండా ఉంటుంది.
గర్భిణీలలో పొత్తి కడుపు నొప్పికి కడుపులో గ్యాస్ పెరగడమే కారణమా?
కాదు. వేరే కారణాలు కూడా ఉన్నాయి. మసాలా ఆహారాలను తినడం, శరీరంలో జరిగే హార్మోనల్ ఇన్బాలన్స్ కూడా కారణమే. గర్భసంచి చుట్టూ ఉన్న లిగమెంట్స్ సాగడం వలన కూడా గర్భిణీలలో పొత్తికడుపులో నొప్పి వస్తుంది.
గర్భిణీలు పొత్తి కడుపు నొప్పిని ఎప్పుడు సీరియస్ గా తీసుకోవాలి?
నొప్పి ఎక్కువై కళ్ళు తిరగడం, బ్లీడింగ్ కావడం వంటివి జరిగితే వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.