- సినీ రంగాన్ని పట్టి పీడిస్తున్న కరోనా
- ఇటీవలే ఇద్దరు ఆగ్ర దర్శకులకూ కరోనా
- గాయని స్మితకూ సోకిన కరోనా
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడు సెలబ్రిటీలను ఒక్కొక్కరిగా వెంబడిస్తోంది. బాలీవుడ్ శహెంషా అమితాబ్ బచ్చన్ కరోనా నుంచి కోలుకున్న వార్త అందరినీ సంతోషపరిచేలోపే టాలీవుడ్ లో బాగా పేరుపొందిన గాయకుడు శ్రీ బాలసుబ్రమణ్యం కరోనా బారిన పడ్డారు. అయితే తనకు కరోనా సోకినా చాలా ఆరోగ్యంగా ఉన్నానని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఒక వీడియో ద్వారా అభిమానులకు తెలియజేశారాయన.
గత మూడు రోజులుగా ఒంట్లో కాస్త ఇబ్బందికరంగా అనిపించడంతో హాస్పిటల్ కి వెళ్ళి కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు ఎస్పీ బాలు తెలియజేశారు. రిపోర్టులో తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని, డాక్టర్ లు మందులు ఇచ్చి హోం క్వారంటైన్ లో ఉండమన్నారని చెప్పారు.
ఈ సమయంలో ఇంట్లో ఉండటం కంటే ఆస్పత్రిలోనే ఉండటం మంచిదని భావించిన ఆయన ఆస్పత్రిలోనే క్వారంటైన్ లో ఉంటానన్నారు. తనకి దగ్గు, జలుబు, జ్వరం తప్ప ఇతర ఏ రకమైన లక్షణాలు లేవని మందులు వాడుతున్నానని ఇప్పుడు జ్వరం కంట్రోల్ లోకి వచ్చినట్లు తెలిపారు.
తన ఆరోగ్య సమాచారం తెలుసుకోవడం కోసం తన శ్రేయోభిలాషులు ఎందరో ఫోన్ లు చేస్తున్నారని కానీ ఇప్పుడు తనకి విశ్రాంతి అవసరం అయినందున ఎవరితో ఫోన్ లో కూడా మాట్లాడలేనని తెలియజేశారు.
మందులు వాడుతున్నందున ఇప్పుడు జ్వరం కంట్రోల్ లోకి వచ్చిందని త్వరలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తానని ఎస్పీ బాలు తెలియజేశారు.