కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ లో ప్రజలంతా చాలా రోజులు ఇంట్లోనే గడిపారు. బయట రెస్టారెంట్ లలో, హోటల్లో తినే అలవాటు ఉన్నవారికి, ముఖ్యంగా భోజన ప్రియుల పట్ల ఇది శాపంగా మారిందనే చెప్పాలి.
అయితే ఇప్పుడు దాదాపు 90 శాతం లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన తరువాత ప్రజలు రెస్టారంట్ లలో తమకు నచ్చిన, ఎంతో ఇష్టమైన రెస్టారెంట్ లలో ఆహారం తినడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఫ్రెండ్స్ తోనో, ఆఫీస్ కొలీగ్స్ తోనో, కుటుంబ సభ్యులతోనో కలిసి కొంత మంది రెస్టారెంట్ లలో తినేస్తున్నారు కూడా.
కరోనా సమయంలో బయట తినడం సురక్షితమేనా?
కరోనా వైరస్ ఆహారం ద్వారా సోకదు. కరోనా వైరస్ కేవలం వ్యాధి సోకిన వ్యక్తి తుమ్మినపుడు, దగ్గినపుడు వెలువడే డ్రాప్లెట్స్ ద్వారా మాత్రమే ఇతరులకు సోకుతుంది.
కరోనా వ్యాధి సోకిన వ్యక్తి మీకు దగ్గరగా నిలబడి మాట్లాడినపుడు మాత్రమే ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది.
మరి ఇటువంటి పరిస్థితుల్లో రెస్టారెంట్ లకు వెళ్ళి భోజనం, అల్పాహారాలు తీసుకోవడం ఎంతవరకు సురక్షితం? తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
“మీరు ఇతరులను కలిసినపుడు వారితో ఎంత దగ్గరగా మసలుతున్నారు ? ఎంత ఎక్కువ మందిని కలుస్తున్నారు?” అనే దాని ఆధారంగానే మీకు కరోనా వ్యాధి సోకే అవకాశాలను అంచనా వేయవచ్చు అంటున్నారు నిపుణులు.
ఈ నేపథ్యంలోనే హోటళ్లు, రెస్టారంట్లు, బిర్యానీ సెంటర్ల యాజమాన్యాలు లాక్ డౌన్ కారణంగా తమ వ్యాపారాల్లో వచ్చిన నష్టాలను పూడ్చుకునేందుకు అన్ని రకాల జాగ్రత్తలతో కస్టమర్లకు ఆహారాన్ని అందిస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నాయి.
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొన్ని రెస్టారెంట్ లలో, పేరు మోసిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కొంతమందికి కరోనా సోకింది. ప్రభుత్వం వాటిని సీజ్ చేయడం కూడా జరిగింది.
మరి ఈ సందర్భంలో మన కుటుంబం యొక్క క్షేమం గురించి ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది.
రెస్టారెంట్ లకు, హోటల్ కు వెళ్ళేముందు ఇవి ఆలోచించండి.
మీరు కానీ మీ కుటుంబంలో ఇంకెవరైనా కానీ 65సం.ల వయసు దాటి తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారేమో గుర్తించండి.
ఎందుకంటే ఇంతకుముందే తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నవారికి కరోనా వ్యాధి సోకితే అది వారి ఆరోగ్యాన్ని ఇంకా క్షీణింపజేస్తుంది.
మీరు తరచుగా కలుస్తున్నవారు, మీ ఇంట్లో వాళ్ళు కోవిడ్ 19 గైడ్ లైన్స్, అంటే మాస్క్ లు ధరించడం, తరచూ చేతులను కడుక్కోవడం వంటివి చేస్తున్నారా?
ఇతర వ్యక్తులను కలిసినపుడు సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారా?
బయటి నుంచి వచ్చిన వస్తువులను, కూరగాయలను, పండ్లను కడిగి ఉపయోగించాలి అనే నియమాన్ని అమలు చేస్తున్నారా?
ఆహారాన్ని పంచుకోవడం, తిను బండారాలను ఒకరి ఇంటికి ఒకరు పంపించుకోవడం మనకు బాగా అలవాటు, కానీ ఈ కరోనా సందర్భంలో ఈ అలవాటుని తగ్గించుకోవడమే మంచిది.
మీరు ఉంటున్న ఏరియాలో వైరస్ వ్యాప్తి ఎలా ఉంది? వైరస్ వ్యాప్తి పెరుగుతున్న ఈ పరిస్థితుల్లో రాకపోకలు, ఆహారాలను పంచుకోవడాలను తగ్గించడం ద్వారా వైరస్ వ్యాప్తిని కొంతవరకైనా అరికట్టవచ్చు.
తప్పనిసరిగా రెస్టారెంట్ కి వెళ్లాల్సి వస్తే ఈ జాగ్రత్తలు తీసుకోండి.
ముందుగా కోవిడ్ 19 సందర్భంలో పాటించాల్సిన అన్ని జాగ్రత్తలను రెస్టారెంట్ యాజమాన్యం పాటిస్తున్నారో లేదో కనుక్కోండి.
లోపల వడ్డించే సిబ్బంది అందరూ మాస్కులను ఖచ్చితంగా ధరిస్తున్నారో లేదో చూడండి.
కూర్చునే కుర్చీలు ఖచ్చితంగా ఆరు అడుగుల దూరంలో ఉన్నాయో లేదో గమనించండి.
టేబుల్ కి ఇద్దరు మాత్రమే కూర్చునేలా ఏర్పాట్లు ఉన్నాయా, కుర్చీలు దూరం దూరంగా ఉన్నాయా చూడండి.
మీ కారును మీరే పార్క్ చేసుకోవడం ఎంతైనా శ్రేయస్కరం.
కోవిడ్ సమయంలో రెస్టారెంట్ లకు వెళ్ళినపుడు కరోనా సోకకుండా ఉండాలంటే?
మీరు కొద్దిపాటి అనారోగ్యం తో ఉన్నా బయటికి వెళ్ళకండి
రెస్టారెంట్ లో తినేటప్పుడు తప్ప ఎప్పుడూ మాస్క్ ధరించే ఉండండి
ఎదుటి వ్యక్తికి ఆరు అడుగుల దూరంలో ఉండండి. రెస్టారెంట్ లోకి వెళ్ళేటపుడు, బయటికి వచ్చేటపుడు ఇంకా వెయిటింగ్ రూమ్ లో కూర్చున్నపుడు కూడా ఈ సామాజిక దూరం పాటించడం తప్పనిసరి.
రెస్టారెంట్ లో వాష్ రూమ్ ని వాడే సమయంలో సానిటైజర్స్, సోప్స్ ఉన్నాయో లేదో చూసుకోండి. వాష్ రూమ్ కి వెళ్లొచ్చిన తరువాత తప్పకుండా సోప్ తో చేతులను శుభ్రపరచుకోవాలి.
చివరిగా
ఇంటికి బయలుదేరే సమయంలో రెస్టారెంట్ డోర్ లను తగలకుండా బయటికి రావడం మంచిది. రెస్టారెంట్ నుంచి బయలుదేరే ముందు చేతులను సోప్ తో శుభ్రంగా కడుక్కోవడం మరిచిపోకూడదు.