మన ప్రవర్తనలో మనకే తెలియని వింతలు విచిత్రాలు చాలా ఉంటాయి. వాటిని మనం గమనించము కారణాలు వెతకము. మనం మన జీవితంలోని చెడు సంఘటనలనే ఎక్కువగా గుర్తుంచుకుంటాము. అలాగే మనకు మంచి చేసిన వ్యక్తులకంటే ఎక్కువగా మనకు హాని చేసేవారే గుర్తుంటారు. బాధ కలిగించే సంఘటనలు, మనుషులనే పదేపదే గుర్తు చేసుకుంటూ ఉంటాం. వీటన్నింటికీ కారణాలు ఏమిటి? ఎక్కువమందిలో ఇలాగే ఎందుకు జరుగుతుంది?
మనసు మాట వినదా?
నేను… నేను అని పదేపదే అంటాం కానీ…మన ఆలోచనల్లో చాలా భాగం మన చేతుల్లో ఉండవు. మన మెదడు మనకు నచ్చినట్టుగా కాకుండా తనకు అలవాటైనట్టుగా ఆలోచిస్తుంది. ఆ విషయాన్ని మనం అంతగా పట్టించుకోము. మనలో వచ్చే నెగెటివ్ ఆలోచనలు కూడా చాలా వరకు మెదడు పుణ్యమే అని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే అది తనకు అలవాటైన పద్ధతిలో నెగెటివ్ విషయాలను మనకు గుర్తు చేసి విసిగిస్తుందన్నమాట. ఇలా ఎందుకు జరుగుతుంది… ఈ విషయంలో మనం మన మెదడుని అదుపులో ఉంచలేమా…ఉంచాలంటే ఏం చేయాలి?
మన మెదడు నెగెటివ్ విషయాలకే ఎక్కువగా ఎందుకు స్పందిస్తుంది?
మన ఆలోచనా విధానం గురించి మనం అంతగా పట్టించుకోము. మనకు ఏ ఆలోచనలు వస్తే…అవే నిజాలనే భ్రమలో ఉంటాం. నెగెటివ్ ఆలోచన విషయంలో ఇలాగే జరుగుతుంది. ఎప్పుడో పదేళ్ల క్రితం ఒక వ్యక్తి మనకేదైనా చిన్న హాని చేసినా అది నిన్నో మొన్నో జరిగినట్టుగా చాలా బాగా స్పష్టంగా గుర్తుంటుంది. కానీ రెండుమూడేళ్ల క్రితం మనకెంతో మేలు చేసిన వ్యక్తి మనకు అంతగా గుర్తు ఉండకపోవచ్చు.
ఎప్పుడో జరిగిన చెడు ఇప్పుడే జరిగిందేమో అన్నంత తాజాగా మనకు గుర్తు ఉండటానికి కారణం …మెదడుకి నెగెటివ్ ఆలోచలంటే ఇష్టం ఉండటమే అంటున్నారు నిపుణులు.
అసలు డిప్రెషన్ కి కూడా కారణం ఇదేనని చెప్పాలి. నెగెటివ్ ఆలోచనలను వదిలించుకోలేకపోవటం వల్లనే ఎవరైనా డిప్రెషన్ కి గురవుతుంటారు. మెదడుకి నెగెటివ్ విషయాలే ఎక్కువగా గుర్తుండటం వలన వాటి ప్రభావం మన ఆలోచనలు నిర్ణయాలు ప్రవర్తనలపైన కూడా ఉంటుంది.
ఇప్పుడు ప్రస్తుతంలో జరుగుతున్న నెగెటివ్ సంఘటనలకు ఎక్కువగా స్పందించడమే కాదు…ఎప్పుడో గతంలో జరిగిపోయిన నెగెటివ్ విషయాలను సైతం మన మెదడు పదేపదే గుర్తు చేస్తుంది. అంతా మన మంచికే జరిగిందని అనుకోవాలని, ఎదుటి మనిషిలో చెడుకంటే మంచినే ఎక్కువగా చూడాలని పదేపదే అనుకుంటాం కానీ… అది చాలా కష్టంగా మారడానికి కారణంలో మెదడులోని ఈ లక్షణమేనన్నమాట.
అందుకే మనకు మన జీవితాల్లో జరిగిన బాధాకరమైన విషయాలు సంఘటనలు బాగా గుర్తుంటాయి. వాటిని మర్చిపోవటం కష్టంగా మారుతుంది. అంతేకాదు సంతోషంకంటే బాధాకరమైన విషయాలకే మనం ఎక్కువగా స్పందించడానికి కారణం కూడా ఇదే.
నెగెటవ్ విషయాలనే ఎక్కువగా గుర్తుపెట్టుకోవటం వలన జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఏమిటి?
నెగెటివ్ విషయాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం అనేది మన జీవితాలపై చాలా ప్రభావాన్ని చూపుతుంది. ఒక రోజంతా హాయిగా ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగి పోయినా..ఏదో ఒక విమర్శ కానీ, చిన్న భేదాభిప్రాయం కానీ ఎవరితోనన్నా వస్తే… అది మాత్రమే మనకు ఎక్కువగా గుర్తుంటుంది.
ఎలా జరిగింది ఈ రోజు…అని ఎవరైనా అడిగితే ఆ సంఘటనే మొదటగా గుర్తుకు వస్తుంది. మెదడుకి ఉన్న ఈ అలవాటు మానవ సంబంధాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.
తల్లిదండ్రులు తమ కోసం ఎంతగా కష్టపడినా తమన్నమాటంటే పిల్లలు తట్టుకోలేరు. అలాగే భార్యాభర్తలు, అత్తాకోడళ్లు తోబుట్టువులు ఇలాంటి ఆత్మీయ అనుబంధాల మధ్య అంతరాలు సృష్టించేది కూడా మెదడుకి ఉన్న ఈ అలవాటే.
ఒక మనిషిలో నెగెటివ్ విషయాలనే ఎక్కువగా గుర్తుంచుకోవటం వలన బంధాల్లో విభేదాలు చాలా త్వరగా వస్తాయి. ఆఫీసుల్లో పని విషయంలో కూడా ఇదే జరుగుతుంది. పై అధికారి ఎన్ని ప్రశంసలు ఇచ్చినా గుర్తుపెట్టుకోని ఉద్యోగులు ఒక్క చిన్నపాటి విమర్శ చేసినా తమని బాధపెడుతున్నట్టుగా భావించే అవకాశం ఉంది.
ఎన్నో ప్రశంసలు తెచ్చే ఆనందం కంటే ఒక చిన్న విమర్శ వలన వచ్చే కోపం ఎక్కువగా ఉంటుంది. ఎవరితో నన్నా గొడవ పెట్టుకున్నపుడు ఆ వ్యక్తిలోని మంచి లక్షణాలు ఒక్కటి కూడా గుర్తురాకపోవటం, అతనిలోని చెడు గుణాలు, లోపాలు మాత్రం బాగా గుర్తు రావటం కూడా మనం చాలా సార్లు గమనిస్తూనే ఉంటాం.
చాలామంది తమకు జరిగిన చిన్నపాటి అవమానాలను గుర్తు పెట్టుకుని సంవత్సరాల తరబడి బాధపడుతుంటారు. అందరూ దానిని మర్చిపోయినా…. దాని గురించే మాట్లాడుతున్నారని నమ్ముతుంటారు. మెదడు చేసే ఈ నెగెటివ్ మాయాజాలాన్ని అర్థం చేసుకోలేక జీవితంలో ఎన్నో సమస్యలను కొనితెచ్చుకుంటున్నామన్నమాట మాత్రం నూరుశాతం నిజం.
మెదడు పాజిటివ్ దృక్పథాన్ని పెంచుకోవాలంటే?
మనం విజయం నుండి ఎక్కువ పాఠాలునేర్చుకుంటామా…అపజయం నుండా అనే ప్రశ్న వేసుకుంటే అపజయం నుండేనని చెప్పాలి. ఒక రంగంలో ముందుకు వెళ్లాలని ఆశించిన వారు…మొదటగా అంతకుముందు ఆ రంగంలో ఉన్నవారు చేసిన తప్పులను మనం చేయకూడదు అనే ఆలోచన చేస్తారు. విజయాలు సాదించినవారు స్ఫూర్తిని ఇచ్చినా…అపజయాలు ఎదుర్కొన్నవారినుండే ఎక్కువ పాఠాలు నేర్చుకోవచ్చని భావిస్తారు. అధ్యయనాల్లో తేలిన విషయం ఇది.
జీవితం హాయిగా సుఖవంతంగా ఉన్నప్పటికంటే కష్టాలు ఎదురైనప్పుడే ఎవరైనా మరింత కసిగా పనిచేయాలని ఆశిస్తారు. విజయాలకంటే అపజయాలు, విమర్శలు మరింత మోటివేషన్ గా పనిచేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే నెగెటివ్ వార్తలకే జనం ఎక్కువగా ఆకర్షితులు అవుతుంటారు.
ఎవరి గురించైనా మంచి గా చెబుతుంటే అంతగా పట్టించుకోనివారు కూడా… నెగెటివ్ మాటలకు మాత్రం ఆకర్షితులవుతుంటారు. అందుకే పుకార్లు అంత వేగంగా వ్యాపిస్తుంటాయి. ఇదంతా మెదడుకున్న నెగెటివిటీ పక్షపాతమే.
నెగెటివ్ విషయాల పట్ల మెదడు పక్షపాతం చూపటం అనేది మనుషుల్లో సంవత్సరం వయసునుండే మొదలవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే అవి మనపై అంతగా పట్టుని సాదిస్తున్నాయి. ఏదిఏమైనా మెదడుకున్న ఈ నెగెటివిటీ పక్షపాతం అలవాటుని వదిలించుకుని పాజిటివ్ దృక్పథాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఇప్పుడు మనందరిపై ఉంది.
ఈ అలవాటును ఎలా వదిలించుకుందాం?
‘కీడెంచి మేలెంచాలనే‘ మాటని చాలా సార్లు వింటూ ఉంటాం. చెడుపైన ఎక్కువ దృష్టిని పెడితే దాని నుండి తప్పించుకోవచ్చనే ఆలోచనలతో మనిషికి నెగెటివ్ గా ఆలోచించడం అలవాటైంది. కొన్ని వందల ఏళ్లు గా కొనసాగుతూ వస్తున్న ఆలోచనలు ఇవి. అడవుల్లో మృగాల మధ్య జీవిస్తూ నిరంతరం బతుకుపోరాటం చేస్తూ… బతకాల్సి రావటం వలన ఏర్పడిన నెగెటివ్ ఆలోచనలు అవి. తరతరాలుగా మనతోనే ఉన్నాయి. ఇప్పుడు వాటిని మార్చుకుని మెదడుకున్న నెగెటివిటీని వదిలించుకోవాల్సి ఉంది.