ఇస్లామాబాద్: ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్.. ఓ మాజీ క్రికెటర్‌ను బలితీసుకుంది. ఈ మహమ్మారి కారణంగా పాకిస్థాన్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ జాఫర్ సర్ఫరాజ్ మృతి చెందాడు.
కరోనా లక్షణాలతో బాధపడ్డ జాఫర్ సర్ఫరాజ్(50)ను మూడు రోజుల క్రితమే పెషావర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి, ఇంటెన్సివ్ కేర్‌లో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ మంగళవారం ఆయన తుదిశ్వాస విడిచారని ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో తెలిపింది. కరోనాతో మృతి చెందిన తొలి ఫ్రొఫెషనల్ క్రికెటర్ జాఫరే.
పాకిస్థాన్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించనప్పటికీ.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో జాఫర్ తనదైన ముద్ర వేశాడు. 1988 నుంచి 1994 వరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. 15 మ్యాచుల్లో ఫెషావర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి 616 పరుగులు చేశాడు. 1990 నుంచి 1992 వరకు లిస్టు -ఏ క్రికెట్‌లో 6 వన్డేల్లో 96 పరుగులు చేశాడు. 1994లో ఆటకు వీడ్కోలు పలికి కోచ్‌గా మారాడు. 2000 మధ్యలో పెషావర్ సీనియర్, అండర్-19 జట్లకు కోచ్‌గా పనిచేశాడు.
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అక్తర్ సర్ఫరాజ్ సోదరుడే జాఫర్. పది నెలల క్రితమే క్యాన్సర్‌తో అక్తర్ సర్ఫరాజ్ మరణించారు. ఇక పాకిస్థాన్‌లో కరోనా రోగుల సంఖ్య 5716కు చేరగా 96 మంది మరణించారు. 1,378 మంది కోలుకున్నారు.