కొంతమంది పిల్లలకు క్లాసు బోర్డు మీద టీచరు రాసిన అక్షరాలన్నీ బుర్రలో కాకుండా, గాల్లో కలిసిపోతూ ఉంటాయి. అంతా అర్థమయినట్టే అనిపిస్తుంది. కానీ రాయబోతే అన్నీ తప్పులే. పోనీ అప్పచెబుతామంటే, అంతా అయోమయమే ఫలితంగా మార్కులు పడిపోతాయి. దాంతో పిల్లలకు చదువులో మార్కులు ఎందుకు తక్కువగా వస్తున్నాయో పెద్దలకు అర్థం కాదు. బడికి తోడుగా ట్యూషన్ చెప్పించినా ప్రయోజనం కనిపించదు. ఇలాంటప్పుడు పిల్లల తల్లితండ్రులు ఆందోళనకు లోనవటం సహజమే.
పిల్లలు నేర్చుకోవడం ఈ వయసుకన్నా ఆలస్యం కాకూడదు
పిల్లలు నెలల వయసు నుంచే ప్రపంచం నుంచి నేర్చుకోవడం మొదలు పెడతారు. కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. చదవడం, రాయడం, లెక్కించడం, ఏది ఎక్కడ ఉందో తెలుసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా లేదంటే పిల్లల్లో ఏదో ఒక సమస్య ఉందనే విషయాన్ని గుర్తించాలి. ఈ సమస్యను త్వరగా గుర్తించి, సరైన పరిష్కార మార్గాలను తెలుసుకోవడం ద్వారా సమస్యను కొంత వరకూ అధిగమించవచ్చు.
మనం ఒక విషయం తెలుసుకోవడం అంటేనే సమాచారం మన దగ్గరకు రావడం, దాన్ని ప్రాసెస్ చేసుకోవడం, అర్థం చేసుకోవడం. ఈ మొత్తం ప్రక్రియలో ఎక్కడ సమస్య ఎదురైనా లెర్నింగ్ డిజేబిలిటి ఉందనే విషయాన్ని గ్రహించాలి. చదవడంలో కావచ్చు, రాయడంలో కావచ్చు, లెక్కించడంలో కావచ్చు, అర్థం చేసుకోవడంలో కావచ్చు కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు.
పిల్లలు నేర్చుకోలేకపోతే ఎలా?
సాధారణంగా 18 ఏళ్ళ లోపు పిల్లల్లో 8 నుంచి 10 శాతం వరకూ ఈ సమస్యలు ఉండవచ్చు. సాధారణంగా కొన్ని కొన్ని విషయాల్లో ఈ ఇబ్బంది ఎదురౌతూ ఉంటుంది. అయితే అన్ని విషయాల్లో ఈ సమస్య ఎదురైందంటే మాత్రం కాస్త ఆలోచించాల్సిందే. అలాగే ఈ సమస్యకు పిల్లల తెలివితేటలకు సంబంధం ఉందనుకోకూడదు. ఇది నేర్చుకోవడంలో వచ్చే సమస్య మాత్రమే. నేర్చుకున్న వాటిని మాత్రం సరైన విధంగానే నిర్వహించగలరు.
ఇలాంటి పిల్లలు పాఠశాలలో నేర్చుకోవడం మరింత ఇబ్బందిగా మారుతుంది. ఇందులో అనేక రకాలు ఉంటాయి. కొన్ని సమయాల్లో ఇది ADHDగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఇందులో ప్రధానమైనది డిస్లెక్సియా. ఇది మెదడు పనిచేయగలిగే నైపుణ్యాల మీద ప్రభావం చూపుతుంది.
డిస్లెక్సియా
కొన్ని విషయాల్లో ఇబ్బంది పడే పిల్లలు మరికొన్ని విషయాల్లో మెరుగైన పని తీరు కనబరిచే ఇబ్బందినే డిస్లెక్సియాగా చెప్పవచ్చు. ఈ సమస్యలో మాట్లాడ్డంలో ఇబ్బందులు, చూపు, రుచి, వాసనలో సమస్యలు, కంటి కదలికలో సమస్యలు ఇందులో ఉంటాయి.
పిల్లలు రాయగలిగే సామర్థ్యాన్ని డైస్లెక్సియా ప్రభావితం చేస్తుంది. ఇందులో రాయడం, చదవడం కష్టం అవుతుంది. మాటలు కూడా తమంతట తాము పలుకలేరు. వారు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ చెప్పలేరు. ఇలాంటి సమస్య 4 ఏళ్ళ లోపు పిల్లల్లో సర్వసాధారణమే ఆ తర్వాత ఉంటే మాత్రం గమనించుకోవాలి.
లెక్కించగలిగే సామర్థ్యాన్ని దెబ్బతీసే డిస్‌కాలిక్యులియా
ఇది అనేక రూపాల్లో ఉంటుంది. కనీసమైన లెక్కలను కూడా చేయలేని పరిస్థితి ఇది. ఒకసారి చేసిన లెక్కను మరో సారి గుర్తించే అవకాశం కూడా ఉండదు. శబ్ధాలను గుర్తించలేని డిజేబులిటీ ఇందులో మరో రకం. అంటే అసలు వినిపించకపోవడం కాదు. ఒక్కోసారి చిన్న శబ్ధమే పెద్దగా ఉలిక్కిపడేలా చేయడం, కొన్ని మార్లు పెద్ద శబ్ధాలు కూడా వినిపించకపోవడం లాంటివి ఇందులో ఉంటాయి. చదవడంలో సమస్యలు, శబ్ధాలను గుర్తించడం, మాట్లాడే దిశలను అనుసరించడం, విన్న విషయాలను గుర్తు చేసుకోవడం లాంటి విషయాల్లో సమస్యలు ఎదురౌతాయి.
విజువల్ ప్రాసెసింగ్ డిజార్డర్
చూసిన వస్తువులను గుర్తు పట్టే విధానంలోనూ సమస్యలు ఉంటే, దాన్ని విజువల్ ప్రాసెసింగ్ డిజార్డర్ గా చెబుతారు. రెండు వస్తువుల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించలేకపోవడం మొదలుకుని అనేక సమస్యలు ఎదురౌతూ ఉంటాయి. పిల్లల్లో ఏ విషయంలో సరైన ఉత్సాహాన్ని చూడకపోయినా, వారికి సమస్య ఉందనే విషయాన్ని గుర్తించాలి. ఇదంతా ఐదేళ్ళు పైబడిన పిల్లల్లో మాత్రమే. ఈ సమస్యలు గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి.
తల్లిదండ్రుల బాధ్యత
పిల్లల్లో లెర్నింగ్ డిజేబులిటీ ఉందని గుర్తించిన వెంటనే, పిల్లల అభివృద్ధికి అది ఆటంకం కాకుండా వైద్యున్ని సంప్రదించాలి. సమస్య కచ్చితంగా ఉందని నిర్థరించినప్పుడు, ఇలాంటి పిల్లల కోసం ప్రత్యేకమైన చికిత్సలు అందుబాటులో ఉంటాయి. స్పీచ్ థెరఫి, విజువల్ థెరఫి లాంటివి అందుబాటులో ఉంటాయి. కొన్ని చోట్ల ఇంటికి వచ్చి పిల్లలకు శిక్షణ అందించే సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు బాధ్యత మొత్తం, పిల్లలు నేర్చుకునేలా ప్రోత్సహించడమే. ఎందుకంటే ఈ సమయంలో పిల్లలు నేర్చుకోవడం పట్ల పెద్దగా ఆసక్తికనబరచరు. వారు ఎలా నేర్చుకుంటున్నారనే విషయాన్ని కూడా తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. పిల్లలకు ఆరోగ్యమైన ఆహారం, మంచి నిద్ర, వ్యాయామం ఉండేలా చూడడం, వారి అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ముఖ్యం.
చివరిగా
పొద్దున ఏం తిన్నావని ఎవరైనా అడిగితే, గుర్తు తెచ్చుకుని చెబుతాం కానీ డిస్లెక్సియా పిల్లల విషయంలో ఈ ప్రాసెస్ మొత్తం సక్రమంగా జరగకుండా, ఎక్కడో ఒకచోట అడ్డంకి ఏర్పడుతుంది. చదువులోనూ ఇదే పరిస్తితి. ఇలాంటప్పుడు తోటి పిల్లల ఎగతాళి, చదువులో వెనకబడుతున్నామనే బాధ పిల్లలను వేధిస్తుంది. పెద్దలేమో పిల్లలను ఇంకా మంచి స్కూల్లో వేస్తే చదువు బాగా వస్తుందనే ఆశతో పదే పదే స్కూళ్లు మారుస్తూ ఉంటారు.
ఏ ఒక్కరూ పిల్లలకున్న అసలు సమస్యను గుర్తించే ప్రయత్నం చేయరు. ఇలా జరగకుండా ఉండాలంటే పిల్లలు చదువులో వెనకబడటానికి అసలు కారణాన్ని కనిపెట్టాలి. డిస్లెక్సియా అని నిర్థారణ జరిగితే స్పెషల్ ఎడ్యుకేషన్ ఇప్పించాలి.